విడుదల తేదీ : 1 మే 2014 TeluguWorld.wap.sh : 3.0/5 దర్శకుడు : మారుతి నిర్మాత : బన్ని వాసు సంగీతం : జెబి నటీనటులు : అల్లు శిరీష్, రెజీనా, మధురిమ..
లో బడ్జెట్ తో సినిమాలు తీసి బిగ్గెస్ట్ హిట్స్ అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి. ‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’, ‘ప్రేమకథా చిత్రమ్’ లాంటి సినిమాలతో వరసుగా హిట్స్ అందుకున్న మారుతి చేసిన మరో ప్రయత్నమే ‘కొత్త జంట’. అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటించగా మధురిమ సెకండ్ హీరోయిన్ గా నటించింది. జెబి సగీతం అందించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో బన్ని వాసు నిర్మించాడు. ఒకవైపు డైరెక్టర్ గా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకుంటున్న మారుతి, మరోవైపు హీరోగా కమర్షియల్ హిట్ అందుకోవాలని ఆశగా ఉన్న అల్లు శిరీష్.. వీరిద్దరి కోరికలని నెరవేర్చే రీతిలో ఈ ‘కొత్త జంట’ ఉందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
చిన్నప్పుడే శిరీష్(అల్లు శిరీష్)కి తన మదర్ అయిన రోహిణి చెప్పిన మాటల వల్ల శిరీష్ బాగా స్వార్ధపరుడుగా, డబ్బే ప్రపంచంగా పెరుగుతాడు. అలాగే తన తండ్రి కాశీ విశ్వనాథ్ చెప్పిన మాటల వల్ల సువర్ణ(రెజీనా కసాండ్రా) కూడా బాగా స్వార్ధపరురాలిగా, డబ్బే ప్రపంచంగా పెరుగుతుంది. అలా పెరిగిన వీరిద్దరూ వై చానల్ ఎండీ అయిన రమేష్(రావు రమేష్) వలన ఒక టీంగా హైదరాబాద్ వై చానల్ బ్రాంచ్ కి షిఫ్ట్ అవుతారు.
వీరిద్దరూ కలిసి ‘కొత్త జంట’ అనే ప్రోగ్రాం చేస్తారు. ఈ ప్రోగ్రాంకి చాలా పేరు వస్తుంది, అలాగే ఈ ప్రోగ్రాంలో చేసిన ఓ పెళ్లి వల్ల రాష్ట్ర యూత్ లీడర్ అయిన వీరబాబు నుంచి వారికి సమస్య వస్తుంది. అదే సమయంలో బినామీ బిగ్ షాట్ అయిన పోసాని కృష్ణ మురళి శిరీష్, సువర్ణలకి ఒక ఆఫర్ ఇస్తాడు. ఆ ఆఫర్ కి శిరీష్ ఒప్పుకున్నా సువర్ణ మాత్రం ఒప్పుకోదు. సువర్ణని ఎలాగైనా ఒప్పించి ఆ ఆఫర్ దక్కించుకోవాలన్న ఉద్దేశంతో శిరీష్ సువర్ణని ప్రేమిస్తున్నానని అబద్దం చెబుతాడు.
కానీ శిరీష్ ప్రేమ అపద్దం అని తెలుసుకున్న సువర్ణ ఏం చేసింది? ఎలా రియాక్ట్ అయ్యింది? అలాగే శిరీష్ డబ్బు కంటే ప్రేమే గొప్పదని తెలుసుకున్నాడా? లేదా? అలాగే వీరబాబు నుంచి శిరీష్, సువర్ణలకి వచ్చిన సమస్య ఏమిటి? దానిని ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది మీరు తెరపైనే చూడాలి.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మొట్ట మొదటి ప్లస్ పాయింట్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. సినిమాలో తన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. పెర్ఫార్మన్స్ కి ఆస్కారం ఉన్న పాత్రలో సూపర్బ్ నటనని కనబరిచి ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, లవ్ సీన్స్ లో పెర్ఫార్మన్స్ సింప్లీ సూపర్బ్. ఈ సినిమాతో తనకి ఆఫర్స్ కూడా పెరుగుతాయని ఆశించవచ్చు. ఇక ఈ మూవీలో బాగా సెల్ఫిష్ అయిన పాత్రని అల్లు శిరీష్ బాగా చేసాడు. మొదటి సినిమాతో పోల్చుకుంటే నటనలో, డైలాగ్ డెలివరీలో కాస్త ఇంప్రూవ్ అయ్యాడు.
ఇక ఎప్పటిలానే మారుతి సినిమాలో హీరో పక్కన ఉండే ఓ బాచ్ ఈ సినిమాలో కూడా ఉంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. సప్తగిరి, మధునందన్. ప్రేమకథా చిత్రమ్ తో ప్రేక్షకులను అమితంగా మెప్పించిన సప్తగిరి ఈ సినిమాలో కూడా కొన్ని చోట్ల తన మార్క్ కామెడీని పండించాడు. ముఖ్యంగా కొత్త జంట ఫస్ట్ ఎపిసోడ్ పెళ్లి సీన్ లో బాగా నవ్విస్తాడు. అలాగే మధునందన్ కూడా సెటైర్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఇక సెకండాఫ్ లో ఒక 10 నిమిషాలు వచ్చే పోసాని కృష్ణమురళి ట్రాక్ ప్రేక్షకులని బాగా నవ్విస్తుంది. అలాగే పాత జంట అని చెప్పి ఓంకార్ షో కి పేరడీగా చేసిన సీక్వెన్స్ కూడా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.
మధురిమ చేసిన చిన్న పాత్రే అయినా బాగా చేసింది. అలాగే అటు అమలాపురం సాంగ్ లో బి,సి సెంటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక చివరిగా వచ్చే ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ ఎపిసోడ్ బాగుంది. ముఖ్యంగా అక్కడ రోహిణి చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. జెబి మ్యూజిక్ సినిమాకి మరో హైలైట్.
మైనస్ పాయింట్స్ :
సినిమా స్టార్టింగ్ బాగా చేసినప్పటికీ ఇంటర్వల్ దగ్గరికి వచ్చే టైంకి సినిమాని స్లో చేసేసారు. చెప్పాలంటే కొత్త జంట ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత సినిమాని డ్రాగ్ చేసారనే ఫీలింగ్ కి గురవుతారు. అలాగే సెకండాఫ్ లో సినిమా చాలా చోట్ల స్లోగా సాగే ఎపిసోడ్స్ కాస్త బోరింగ్ గా అనిపిస్తాయి. చెప్పాలంటే సినిమాలో ఎంతసేపూ చెప్పడానికి ట్రై చేసిన ఏకైక పాయింట్ సెల్ఫిష్, దానివల్ల సీన్స్ లో పెద్దగా కొత్తదనం కనిపించకుండా అన్నీ ఒకేలా అనిపిస్తుంటాయి.
మామూలుగా మారుతి సినిమాల్లో ఉండే ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఇందులో ఉండకపోవడం మేజర్ మైనస్. అలాగే మారుతి సినిమాల్లో ఉండే హై డోస్ కామెడీ కూడా ఈ సినిమాలో లేకపోవడం మరో పెద్ద మైనస్. అలాగే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ పెద్ద ఎఫెక్టివ్ గా లేదు, ఇంకా చెప్పాలంటే శిరీష్ కి ఒక ఫైట్ ఉంటే బాగుంటది అని పెట్టినట్టుగా ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన మారుతి సినిమాలను ఊహించుకొని వాటికన్నా మించి ఈ సినిమా ఉంటుంది అని థియేటర్ కి వెళ్ళే ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా నిరుత్సాహపడతారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో ఈ సినిమాకి బాగా హెల్ప్ అయిన ప్రధాన విషయాలు రెండు ఉన్నాయి. అందులో మొదటిది జెబి మ్యూజిక్. జెబి అందించిన పాటలు బాగున్నాయి అంతకంటే అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో హైలైట్. సినిమాటోగ్రఫీ చాలా ఫ్రెష్ గా ఉంది. ఆలాగే విజువల్స్ చాల గ్రాండ్ గా ఉన్నాయి. ఎడిటర్ కూడా కాస్త సాగదీసినట్టు అనిపిస్తున్న సీన్స్ ని, రీపీటెడ్ ఫ్లేవర్ లో ఉన్నాయి అన్న సీన్స్ ని కత్తిరించి ఉంటే బాగుండేది.
ఎప్పటిలానే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – డైరెక్షన్ బాధ్యతలను మారుతి డీల్ చేసాడు. కథ – లైన్ బాగుంది, కానీ ఇంకాస్త ఎంగేజ్ అయ్యేలా స్టొరీ రాసుకోవాల్సింది. స్క్రీన్ ప్లే – ఇంకాస్త స్పీడ్ గా ఉండాల్సింది. డైలాగ్స్ – బాగున్నాయి, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ కి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. డైరెక్షన్ – ఒక డైరెక్టర్ గా సినిమాని కలర్ఫుల్ గా తీసాడు, నటీనటుల నుండి మంచి నటనని రాబట్టుకున్నాడు. కానీ ఈ సినిమాలో ఇప్పటి వరకూ మారుతి మార్క్ అనుకున్న స్పీడ్ నేరేషన్, కామెడీ యాంగిల్స్ ఇందులో మిస్ అవుతాయి. బన్ని వాసు నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.
తీర్పు :
మారుతి మార్క్ తో వచ్చిన ‘కొత్త జంట’ సినిమా ప్రెజెంటేషన్ కొత్తగా ఉంది కానీ అంచనాలను అందుకునే రేంజ్ లో మాత్రం లేదు. రెజీనా పెర్ఫార్మన్స్, కొన్ని కామెడీ ఎలిమెంట్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాకి ప్లస్ అయితే బోరింగ్ ఎలిమెంట్స్ ఉండడం, చాలా చోట్ల సాగదీయడం, స్లో స్క్రీన్ ప్లే చెప్పదగిన మైనస్ పాయింట్స్. మారుతి గత సినిమాలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళేవారు మాత్రం కాస్త నిరుత్సాహపడతారు. అలాగే మారుతికి ఉన్న పేరు వల్ల మొదటి వారం కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది.